ఉపాధి కూలీలకు 100 రోజుల పని కల్పించాలి : కలెక్టర్ వెంకటేశ్​ ధోత్రే

ఉపాధి కూలీలకు 100 రోజుల పని కల్పించాలి : కలెక్టర్ వెంకటేశ్​ ధోత్రే

కాగజ్ నగర్, వెలుగు: జిల్లాలో ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న కూలీలకు 100 రోజుల పని కల్పించేలా చూడాలని కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే ఆదేశించారు. గురువారం కాగజ్ నగర్ మండలం కోయవాగు గ్రామపంచాయతీలో ఉపాధి హామీ పథకంలో భాగంగా చేస్తున్న పనులను జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి దత్తారావుతో కలిసి పరిశీలించారు. వేసవి నేప థ్యంలో ఎండలో కాకుండా ఉదయం, సాయంత్రం వేళల్లో పనులు చేసుకోవాలని సూచించారు.

పని ప్రదేశాల్లో కూలీలకు తాగునీరు, నీడ, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, ఇతర సౌకర్యాలు కల్పించాలని సిబ్బందిని ఆదేశించారు. చింతగూడ గ్రామపంచాయతీలో నర్సరీ పనులను పరిశీలించి సకాలంలో మొక్కలకు నీరందించి సంరక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎంపీడీవో రమేశ్, పంచాయతీ కార్యదర్శులు, ఉపాధి హామీ సిబ్బంది పాల్గొన్నారు.

 ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలి

ప్రభుత్వ ఆస్పత్రులు, ఆరోగ్య కేంద్రాలకు వచ్చే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ సూచించారు. కలెక్టరేట్​లో డీఎంహెచ్​వో  సీతారాంతో కలిసి డాక్టర్లు , ప్రధానమంత్రి జన్ మన్ వైద్య సిబ్బంది, సూపర్ వైజర్లతో వైద్య ఆరోగ్య సేవలపై రివ్యూ నిర్వహించారు. జిల్లాలోని మారుమూల గిరిజన ప్రాంతాలు, పీవీవీజీ ప్రాంతాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సామాజిక ఆరోగ్య కేంద్రాల వైద్య సిబ్బంది పర్యటించి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు. గ్రామీణ ప్రాంతాలలో ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి ప్రజలకు వైద్య సేవలు అందించే దిశగా చర్యలు తీసుకోవాలని సూచించారు.